AP CID: టీడీపీ బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని సీఐడీ నోటీసులు

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని తెలియజేస్తూ సీఐడీ కానిస్టేబుల్ ఒకరు కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని కోరింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ... ఇందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

స్కిల్ నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో రేపు(బుధవారం) విచారణ జరగనున్న సమయంలో ఈరోజు సీఐడీ నోటీసులు ఇవ్వడం కుట్రలో భాగమేనని.. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్డు రిమాండ్ విధించడంతో దాదాపు 52 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అక్టోబర్ 31న ఆయన ఆరోగ్యం దృష్ట్యా చంద్రబాబుకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

ఈ కేసులో ఇప్పటివరకు మనీ ట్రయల్‌కు సంబంధించి సీఐడీ ఎలాంటి ఆధారాలను చూపించలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఖాతాలోకి రూ.27కోట్లు వచ్చాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.