Nara Lokesh:ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. అక్టోబర్ 4న విచారణకు రావాలంటూ ఆదేశం

  • IndiaGlitz, [Saturday,September 30 2023]

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో వున్న లోకేష్‌ను శనివారం సీఐడీ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వారు నోటీసులు అందజేశారు. అక్టోబర్ 4న ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు 41ఏ కింద నోటీసు జారీ చేశారు.

సీఐడీ అధికారులకు కాఫీ ఆఫర్ చేసిన లోకేష్ :

తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐడీ అధికారులకు లోకేష్ కాఫీ, టీ ఆఫర్ చేశారు. రాకరాక వచ్చారు టీ, కాఫీ తాగి వెళ్లాలని ఆయన కోరారు. అయితే ఇందుకు సీఐడీ అధికారులు నవ్వుతూ తిరస్కరించారు. అలాగే తనకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారని లోకేష్ ప్రశ్నించారు. తాము ఢిల్లీలో వున్నందున ఫిజికల్‌గా నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని సీఐడీ అధికారులు లోకేష్‌కు వివరించారు. సాక్ష్యాధారాలను ట్యాంపరింగ్ చేయనని, నోటీసులను క్షుణ్ణంగా చదువుకుంటానని ఆయన పేర్కొన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా లోకేష్ :

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గతేడాది ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో నారా లోకేష్‌ను ఏ 14గా చేర్చారు. దీంతో ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరగ్గా.. లోకేష్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. దీంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలో లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.