విశాఖలో రాజధాని ఫిక్స్.. తరలనున్న శాఖలివే..!
- IndiaGlitz, [Monday,January 06 2020]
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించే ప్రసక్తే లేదని ఎన్నికలకు ముందు చెప్పిన వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు అని మూడు రాజధానులను ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయ్.. ఇదిగో రాజధాని తరలించేస్తున్నారంటూ వార్లు మాత్రం గుప్పుమంటున్నాయ్. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం నుంచి ఫలానా శాఖలను త్వరగా విశాఖకు తరలిస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయ్. అయితే లీకులొచ్చాయో లేకుంటే.. రాయేస్తే తగులుతుంది కదా అని ట్రైల్స్ వేస్తున్నారో తెలియట్లేదు కానీ.. ఈ వార్తలతో రాజధానిలో రైతుల ఆందోళన మరింత తీవ్రం అవుతోంది.
కసరత్తులు మొదలు
విశాఖకు కీలక శాఖలను తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయం ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా సర్కార్ నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఈ నెల 8న జరగబోయే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తరలింపు ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
కీలక శాఖలివే..
20వ తేదీ నుంచే విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయానికి శాఖల తరలింపు
విడతలవారీగా సచివాలయం తరలింపు
శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలింపు
జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఫెనాన్స్ శాఖ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు సెక్షన్లు, హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు తరలింపు
పంచాయతీరాజ్ నుంచి నాలుగు సెక్షన్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యాశాఖ నుంచి రెండేసి సెక్షన్లు తరలింపు
మొత్తం 34 శాఖల నుంచి కీలక విభాగాల తరలించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. రాజధాని తరలింపు పక్కా దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాగా.. ఈ నెల 18న ఉదయం కేబినెట్ భేటీ జరగనుంది. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. మరీ ముఖ్యంగా విశాఖలోనే రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 20 నుంచి విశాఖలో తాత్కాలిక సచివాలయ కార్యకలాపాలకు ప్రభుత్వం యోచిస్తోంది. 23లోపు సచివాలయం తరలింపు ప్రారంభం కావాలని జ్యోతిష్యుల సూచన మేరకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.