వైఎస్ ఎంతో కష్టపడి తెస్తే.. జగన్ ఎందుకీ ఆలోచన!?
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కష్టపడి తెచ్చిన ఓ భగీరథ ప్రయత్నాన్ని .. ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ‘అస్సలు అది వద్దంటే వద్దు’ అని రద్దు చేసేస్తు్న్నారు. ఇంతకీ వైఎస్ అంతలా కష్టపడి తెచ్చిందేంటి..? వైఎస్ జగన్ సింగిల్ కేబినెట్ భేటీతో రద్దు చేసిందేంటి..? అంతేకాదండోయ్.. నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన పనే వైఎస్ జగన్ కూడా చేస్తున్నారు..? ఇంతకీ అదేంటి..? అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నాడు నాన్న అలా.. నేడు జగన్ ఇలా.. బాబు కూడా!
అదేనండోయ్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న ‘శాసన మండలి’. నాడు అనగా.. 2004లో రద్దయిన మండలిని పునరుద్ధరణకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మూడేళ్ల పాటు దీనికోసం కేంద్రం పోరాడగా.. 2007 మార్చి 30న శాసన మండలి పునరుద్ధరణ జరిగింది. నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది ఎమ్మెల్సీలుగా పనిచేశారు. అయితే తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేయడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదండోయ్ ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శాసన మండలిపై సంచలన వ్యాఖ్యలు చేసి రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూడా!
ఇదీ శాసన మండలి చరిత్ర!
‘శాసన మండలి’ సింపుల్‌గా చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో ‘పెద్దల సభ’ (ఎగువ సభ). శాసన మండలి అనే వ్యవస్థ రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా వచ్చింది. 2017 నాటికి భారతదేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ సభ ఉంది. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ‘ఎమ్మెల్సీ’ అని పిలుస్తారు. ఇది శాశ్వత సభ.. అనగా శాసనసభ వలే దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ఇది కేంద్ర ప్రభుత్వంలోని రాజ్యసభ వలే ఉంటుంది.
రద్దు లెక్కలివీ..!
1968 జులై 8న ఏపీ శాసనమండలి ఆవిర్భావం జరిగింది. శాసన మండలిని మొదటి సారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు. కారణం అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు అధికంగా శాసనమండలిలో ఉండడంవల్ల ప్రభుత్వం బిల్లును శాసన మండలి ఆమోదించలేదు.. దీంతో ఎన్టీఆర్ అసహనానికి గురై శాసనమండలిని తొలిసారిగా రద్దు చేశారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. అప్పుడు తిరిగి మళ్ళీ శాసనమండలిని ప్రవేశపెట్టాలని శాసనసభలో బిల్లు చేశారు కానీ అది పట్టాలెక్కలేదు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తిరిగి శాసనమండలిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనమండలి కొనసాగుతోంది. అయితే
రద్దు చేయాలంటే ఎలా!?
‘మండలి’ రద్దు అంత తేలిక వ్యవహారం కాదు.. ముందుగా శాసనసభలో బిల్లు చేసి దానిని కేంద్రానికి పంపాలి. కేంద్రంలో లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరకు ఈ బిల్లు వెళ్తుంది. అనంతరం దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే శాసన మండలి రద్దు అవుతుంది. అదేవిధంగా శాసన మండలి ఏర్పాటు చేయాలన్న ఇదే పద్ధతి పాటించాలి. శాసనమండలిని రాజ్యాంగ కర్తలు మేధావులు కోసం ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు.
ఏమవుతుందో.. ఏంటో!?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేయడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అవి ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో తెలియాలంటే ఈ వ్యవహారం కేంద్రం వద్దకు వెళ్లి రిప్లయ్ ఇచ్చినంతవరకూ వేచి చూడాల్సిందే..! . వాస్తవానికి కేంద్రంతో జగన్ మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. అయితే.. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా అనేదానిపై ప్రస్తుతం అన్నీ అనుమానాలే. మరీ ముఖ్యంగా ఏపీలో బీజేపీకి ఉన్నది ఇద్దరు ఇద్దరే ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ హోదా) ఉన్నారు. వారు కూడా ఎమ్మెల్సీలు మాత్రమే. జగన్ నిర్ణయాన్ని సమర్థించి.. ‘రద్దు’ను ఆమోదిస్తే మాత్రం ఆ ఇద్దరు కూడా మాజీలు అయిపోతారు. ఈ తరుణంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout