Purandeshwari:జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో పార్టీలన్ని ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఓ వైపు వైసీపీ.. మరోవైపు టీడీపీ-జనసేన యుద్ధానికి సై అంటున్నాయి. బీజేపీ మాత్రం సందిగ్ధంలో ఉంది. జనసేనతో పొత్తులో ఉన్నామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా జనసేన ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని.. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం పేరుతో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తున్న వైసీపీ ఏపీకి అవసరమా? అని పురదేంశ్వరి నిలదీశారు.
ఇదిలా ఉంటే జనసేనతో పొత్తులోనే ఉన్నామని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఓవైపు ఏమో టీడీపీతో జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకుని ఉమ్మడి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇరు పార్టీల అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలు మార్లు సమావేశమై ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై కూడా చర్చించారు. అలాగే కార్యకర్తలను కూడా సమాయత్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తులో జనసేన ఉందో లేదో కూడా ఎవరకీ తెలియడం లేదు. పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో కలిసి వస్తుందని చెబుతున్నారు. అటు కమలం నేతలు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టంచేస్తున్నారు. తాజాగా జనసేనతో పొత్తు కొనసాగుతోందని పురందేశ్వరి ప్రకటించడం చర్చనీయాంశంవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి టీడీపీ-జనసేన కూటమిలోకి కాషాయం పార్టీ కూడా కలిసే అవకాశముందని విశ్లేషకలుఉ అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments