ఏపీ అసెంబ్లీ: టాలీవుడ్‌కి షాకిచ్చిన జగన్.. ఇకపై బెనిఫిట్ షోలు కట్, ఆన్‌లైన్‌లోనే టికెట్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే టాలీవుడ్‌కు షాకిచ్చారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలి. అంటే, ఇకపై నేరుగా థియేటర్‌కు వెళ్లి టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసే వెసులుబాటు లేనట్టే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ ‌రెడ్డి తరపున ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి నాని.. బిల్లు లక్ష్యాన్ని సభ్యులకు వివరించారు.

ఇప్పటి వరకు థియేటర్ల ఇష్టాఇష్టాల మీద ఆధారపడి టికెట్ల విక్రయాలు జరిగేవని పేర్ని నాని చెప్పారు. కానీ ఇకపై 1100 థియేటర్లలో ఆన్‌లైన్‌లో టికెట్ విక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. ఛారిటీస్ కోసమే జీవో నెం 35 ప్రకారం.. బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంటుందని పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా త్వరలో రిలీజ్ కానున్న భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ , పుష్ప వంటి భారీ బడ్జెట్ సినిమాలపై తీవ్ర ప్రభావం పడనుంది. మరి ఈ చిత్ర నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరోవైపు .. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌ పెంచుతూ సవరించారు ఈ మేరకు మరో బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను 1 నుంచి నాలుగు శాతం వరకు పెంచారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై అదనంగా రూ. 409 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.