AP Assembly:హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

  • IndiaGlitz, [Tuesday,February 06 2024]

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడంతో వారిని సభాపతి తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. అయితే టీడీపీ సభ్యులు కూడా నిత్యావసర ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. పేపర్లు చింపి స్పీకర్ పోడియంపై విసిరేస్తూ ఈలలు వేశారు. బాదుడే బాదుడు, సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అయితే టీడీపీ సభ్యుల తీరును మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. స్పీకర్‌పై పేపర్లు చింపి వేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. మమ్మల్ని అనవసరంగా రెచ్చొగొట్టే పనులు చేయవద్దు.. ఇష్టం లేకపోతే బయటికి పోండి.. లేదా మార్షల్ వచ్చి బయటకు నెట్టేస్తారని హెచ్చరించారు. ఈ గందరగోళం నేపథ్యంలో 15 నిమిషాలపాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి స్పీకర్ పోడియంపై విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

అయినా కానీ టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు పంపించేశారు. సస్పెండైన ఎమ్మెల్యేల్లో నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గణబాబు, వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్‌రావులు ఉన్నారు.

అంతకుముందు అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు చేరుకున్నారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ కార్లలో తీసుకొచ్చి కొందరు సర్పంచ్‌లను అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. దీంతో తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న సర్పంచ్‌లను పోలీసులు ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.