నాగ‌ర‌త్న‌మ్మ‌ బయోపిక్ లో అనుష్క ?

  • IndiaGlitz, [Monday,March 23 2020]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త్వ‌ర‌లోనే ఓ బ‌యోపిక్‌లో నటించ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వినిపిస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి చిత్రాలు మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. అలాగే ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన నిశ్శ‌బ్దం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. క‌రోనా ప్ర‌భావం లేకుంటే ఈ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంది.

అయితే తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ఓ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఆ బ‌యోపిక్ ఎవ‌రిదో కాదు.. బెంగుళూరుకి చెందిన సింగ‌ర్ నాగ‌ర‌త్న‌మ్మ‌ది. దేవ‌దాసీ కుటుంబంలో పుట్టి సంగీత క‌ళాకారిణిగా ఎదిగిన నాగ‌ర‌త్న‌మ్మ త్యాగ‌య్య సంగీతాన్ని అభిమానించారు. ఆయ‌న స‌మాధి బాగోగుల‌ను చూడ‌ట‌మే కాకుండా.. త‌న సంపాద‌నంతా సంగీత క‌ళాకారుల‌కు ధార‌పోసింది. ఈమె పాత్ర‌లో అనుష్క‌ను తీసుకుంటే బావుంటుంద‌ని సింగీతం భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్‌. మ‌రి అనుష్క ఓకే అంటుందో లేదో వేచి చూడాలి.