ఆయన మ్యూజిక్ నుంచి ఎక్కువ స్పూర్తి పొందుతాను - అనూప్ రూబెన్స్
- IndiaGlitz, [Friday,February 19 2016]
ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే, గోపాలా..గోపాలా.. మనం, సోగ్గాడే చిన్ని నాయనా....ఇలా వైవిధ్యమైన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ...అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. దర్శకురాలు చునియా తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం పడేసావే. కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంటగా నటించిన పడేసావే చిత్రానికి అనూప్ సంగీతం అందించారు. పడేసావే ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా పడేసావే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
మీ మ్యూజిక్ స్టైల్ గురించి చెప్పమంటే ఏం చెబుతారు..?
నా మ్యూజిక్ స్టైల్ ఇలానే ఉంటుంది అని చెప్పలేను. సిట్యూవేషన్ తగ్గట్టు నా మ్యూజిక్ స్టైల్ ఉంటుంది. కాకపోతే నాకు మెలోడీ సాంగ్స్ అంటే బాగా ఇష్టం.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది మీ స్ట్రెంగ్త్ అని చెప్పవచ్చు. మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ కి మీకు ఈ విషయంలో డిఫరెన్స్ ఏమిటి..?
సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే సినిమాకి బ్యాక్ బోన్ లాంటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అందుచేత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలా కేర్ తీసుకుంటాను. ఇక మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తారనే విషయం గురించి నాకు తెలీదు.
పడేసావే సినిమాకి మిగిలిన సినిమాలకు డిఫరెన్స్ ఏమిటి..?
పడేసావే ఒక ఫ్రెష్ ఫిల్మ్. ఫ్రెష్ లవ్ స్టోరీ. సింపుల్ లవ్ స్టోరీని చునియా చాలా బాగా తెరకెక్కించారు. యూత్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఖచ్చితంగా పడేసావే విజయం సాధిస్తుందని మా నమ్మకం.
పడేసావే లో హైలైట్ అంటే ఏం చెబుతారు..?
ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే సీన్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ఆ సీన్ హార్ట్ టచ్చింగ్ గా ఉంటుంది. ఈ సీన్ ఏమిటనేది చెబితే స్టోరీ చెప్పినట్టు ఉంటుందని చెప్పడం లేదు కానీ ఆ సీన్ అందర్నీ టచ్ చేస్తుంది.
సోగ్గాడే...గోపాల గోపాల...ఇలా పెద్ద సినిమాలు చేసిన మీరు పడేసావే అనే చిన్న సినిమా చేయడానికి కారణం ఏమిటి..?
పడేసావే దర్శకురాలు చునియా మనం సినిమా చేస్తున్నప్పటి నుంచి పరిచయం. ఒకరోజు చునియా సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పి కథ చెప్పారు. కథ నచ్చింది. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ అందించాలి అన్నారు. కథ నచ్చడంతో ఓకే అన్నాను.
కథ నచ్చితే చిన్న సినిమాలకు కూడా అనూప్ మ్యూజిక్ అందిస్తారనుకోవచ్చా..?
కథ నచ్చి...మ్యూజిక్ స్కోప్ ఉందనిపిస్తే ఖచ్చితంగా చిన్న సినిమాలకు మ్యూజిక్ అందిస్తాను.
మీ పేరుతో లోగో ఏర్పాటు చేసారు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
నాకు ఎప్పటి నుంచో నా పేరుతో ఒక లోగో ఉంటే బాగుంటుంది అనిపించింది. అది అమ్మతో లాంఛ్ చేయించాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అమ్మ లేదు. నాగ సుశీల గారు ఆ లోగో లాంఛ్ చేయడం కంఫర్ట్ గా అనిపించింది.
మీకు స్పూర్తినిచ్చిన సంగీత దర్శకులు ఎవరు..?
ఇళయరాజా గారంటే బాగా ఇష్టం. అలాగే ఆర్.పి పట్నాయక్ గారంటే ఇష్టం. ఇక ఎ.ఆర్. రెహమాన్ గారంటే చాలా ఇష్టం. ఆయన మ్యూజిక్ నుంచి ఎక్కువ స్పూర్తి పొందుతాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి...?
సుశాంత్ హీరోగా నటిస్తున్న ఆటాడుకుందాం రా సినిమాకి సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు వర్క్ చేస్తున్నాను.