Anukoni Athidhi Review
సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'అనుకోని అతిథి'. 2019 లో విడుదలై మంచి విజయం సాధించిన 'అథిరన్' చిత్రాన్ని తెలుగులో అనుకోని అతిథిగా డబ్ చేశారు. సాయి పల్లవి నటించిన మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి ఉంది. నేడు ఈ చిత్రం ఓటిటి లో విడుదలయింది. సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కథ 1967 బ్యాక్ డ్రాప్ లో ప్రారంభం అవుతుంది. ఊహించని సంఘటలతో కథ మొదలవుతుంది. మళ్ళీ ఐదేళ్లు ముందుకు ప్రజెంట్ లోకి కథ వస్తుంది. ఒక విచిత్రమైన ఆసుపత్రిలోకి నంద (హీరో ఫహద్ ఫాసిల్) ఎంటర్ అవుతాడు. ఆ ఆసుపత్రి గురించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి వచ్చిన మానసిక వైద్యుడిగా నంద కనిపిస్తాడు.
అతడు ఆ ఆసుపత్రి గురించి అధ్యయనం చేసే క్రమంలో అదొక భయంకర ప్రదేశం అని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మాత్రమే కాదు.. ఓ బిగ్ టాస్క్ తో నంద అక్కడికి వచ్చి ఉంటాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి.
ఊహించిన విధంగానే కొందరు అతడిని అడ్డుకునేందుకు, మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. నంద ఆ ఆసుపత్రిలో పూర్తి చేయాల్సిన టాస్క్ ఏంటి ? అతడిని అడ్డుకుంటుంది ఎవరు ? కథలో చోటు చేసుకునే ఊహించని మలుపులు ఏంటి ? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా నెమ్మదిగా సాగుతోంది అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కానీ ప్రేక్షకుడి ఆసక్తి చెడగొట్టకుండా దర్శకుడు సెటప్ చేసిన కథా నేపథ్యానికి ఫుల్ మార్క్స్ వేయొచ్చు. ఉత్కంఠ తో పాటు గుండెల్లో గుబులు పుట్టించేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ సెటప్, సంగీతం బలాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఉత్కంఠ ఉన్నప్పటికీ ట్విస్ట్ లు పెద్దగా రివీల్ కావు. దీనితో ఆడియన్స్ అదే సస్పెన్స్ ని సెకండ్ హాఫ్ లో కూడా కొనసాగించాల్సి ఉంటుంది. ఇక క్లైమాక్స్ అయితే అమేజింగ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే క్లైమాక్స్ లో కథ స్వరూపమే మారిపోతుంది.
సాయి పల్లవి క్యారెక్టర్ పరిచయం చేస్తూ కథలో మిళితం అయ్యేలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. కాకపోతే కాస్త సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. కథలో యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ. దర్శకుడు కోరుకుంటే మధ్యలో కొన్ని సన్నివేశాలని యాక్షన్ తో నింపి ఉండవచ్చు. కానీ అంతా క్లైమాక్స్ కోసమే అన్నట్లుగా దాచుకున్నారు. అతుల్ కులకర్ణి పాత్ర బలంగా ఉంటుంది. అలాగే ఇతర సపోర్టింగ్ రోల్స్ కూడా బావుంటాయి.
తెలుగు నేటివిటీకి దూరంగా ఉండే కథ కావడం, కమర్షియల్ హంగులు లేని థ్రిల్లర్ జోనర్ కథ కావడం చిన్న చిన్న మైనస్ లు గా చెప్పొచ్చు.
నటీనటులు:
ఒక డిఫెరెంట్ సాయి పల్లవిని ఈ చిత్రంలో చూస్తాం. తెలుగు సినిమాల్లో ఆమె డైలాగులు ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఈ చిత్రంలో డైలాగులు లేకుండా ఆమె నటించిన విధానం అద్భుతంగా ఉంటుంది. కేవలం సాయి పల్లవి హావభావాలు మాత్రమే పలికిస్తుంది. హీరో ఫహద్ ఫాసిల్ కథానుగుణంగా రెండు వేరియేషన్స్ లో నటించాలి. ఆ రెండు వేరియేషన్స్ లో ఫహద్ చూపించిన డిఫరెన్స్ సూపర్బ్ అనే చెప్పాలి.
అతుల్ కులకర్ణి డైలాగ్ చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. ఇక నటి లీనా కూడా తన పాత్ర మేరకు బాగానే నటించింది.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ని ప్రత్యేకంగా అభినందించాలి. నటీనటుల పెర్ఫామెన్స్ ని ఎలివేట్ చేసే విధంగా, ఉత్కంఠని పెంచే విధంగా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఫస్ట్ హాఫ్ పై ఎడిటర్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది.
ఫైనల్ పంచ్:
చిన్న చిన్న హర్రర్ ఎలిమెంట్స్ టచ్ తో ప్రేక్షుకుల దృష్టి చివరి వరకు మరల్చకుండా సాగే థ్రిల్లర్ చిత్రం 'అనుకోని అతిథి'. థ్రిల్లర్ చిత్రాలు చూసే వారు ఎలాగు ఈ చిత్రం చూస్తారు. ఇక మిగిలిన ఆడియన్స్ కూడా ఈ సినిమాపై దృష్టి పెడితే సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్ నటన, అమేజింగ్ క్లైమాక్స్ తో ఓ మంచి అనుభూతి పొందుతారు.
- Read in English