ఉగ్రవాదంపై ఉక్కుపాదమే.. కీలక బిల్లుకు పెద్దలు ఆమోదం
Send us your feedback to audioarticles@vaarta.com
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో భాగంగా దాయాదీ దేశాలను గజగజ వణికిస్తున్నప్పటికీ ఉగ్రమూకలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ఇక నుంచి ఉక్కుపాదం మోపనుంది. ఇందుకు కారణం ఉభయ సభల్లో ఉపా బిల్లుకు ఆమోదం లభించడం. శుక్రవారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం(ఉపా) బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది.
కాగా.. శుక్రవారం నాడు సభ మొదలైన తర్వాత తొలుత ఈ బిల్లుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఇదే చర్చ, రచ్చ మధ్యనే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించేశారు. బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గినట్లైంది. మరోవైపు.. యూఏపీఏ సవరణ బిల్లును స్థాయీ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ కూడా వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 104 మంది సభ్యులు, అనుకూలంగా 85 మంది సభ్యులు ఓటు వేయడం గమనార్హం.
షా చురకలు..!
ఈ క్రమంలో అమిత్ షా, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. చట్టాలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలను అమిత్ షా దీటుగా తిప్పి కొట్టారు. ‘ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగింది? మొత్తం మీడియాపై నిషేధం విధించారు. ప్రతిపక్ష నేతలు కనిపిస్తే చాలు జైళ్లలోకి తోసేశారు. దాదాపు 19 నెలల పాటు ప్రజాస్వామ్యం లేనేలేదు. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరా మమ్మల్ని విమర్శించేది? ఒకసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి. ఉగ్రవాదానికి మతం లేదు. మానవత్వానికి వ్యతిరేకంగా మెలిగే వాళ్లే ఉగ్రవాదులు. దీనిపై మనందరం గట్టిగా పోరాడాలి. నేను సవరణ మాత్రమే తెస్తున్నాను. చట్టాన్ని తీసుకురావడం లేదు. సంస్కరణలను ఏ విధంగా చేస్తామో అలాగే ఉగ్రవాదుల విషయంలో మరో ముందడుగు వేస్తాం’ అని ప్రతిపక్షాలకు షా చురకలు అంటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments