close
Choose your channels

Vande Bharat:తెలుగు రాష్ట్రాలకు ముచ్చటగా మూడో వందే భారత్.. సికింద్రాబాద్ నుంచే, రూట్ ఫిక్స్

Tuesday, April 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ ప్రజలకు వేగవంతమైన , సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఫుల్ ఆక్యూపెన్సీతో రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 13 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. త్వరలో సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్-బెంగళూరు మధ్య 570 కి.మీల దూరం:

ఇటీవల సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై నేతలకు ఓ సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే కనుక నిజమైతే బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారు మరింత వేగంగా గమ్యస్థానాలను చేరవచ్చు. అంతేకాదు.. తెలుగు ప్రజలకు మూడు వందే భారత్‌లు ఇచ్చినట్లుగా అవుతుంది. ఇప్పటికే కాచిగూడ, సికింద్రాబాద్‌ల నుంచి బెంగళూరుకు పలు రైళ్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య 570 కి.మీల దూరం వుంటుంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి 11 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో వందే భారత్ అందుబాటులోకి వస్తే మాత్రం 8 గంటల్లోనే గమ్యస్థానికి చేరుకోవచ్చు.

ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌ను ప్రారంభించిన మోడీ :

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారంలో మంగళవారం తప్పించి మిగిలిన అన్ని రోజులు నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లో చేరుకుంటుంది. ప్రతిరోజూ ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 14.30కి చేరుకుంటుంది. అలాగే తిరుపతిలో మధ్యాహ్నం 15.15కి బయల్దేరి రాత్రి 23.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులలో ఆగుతుంది.

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్ :

ఇకపోతే.. జనవరి 15న ప్రారంభమైన సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ విషయానికి వస్తే వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ బండి నడుస్తుంది. విశాఖ నుంచి బయల్దేరే సమయంలో ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. రైలులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు వుంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.