సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మరో ట్విస్ట్..!

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సీవీఎస్‌కే శర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. అయితే జగన్ కేసులో న్యాయ పోరాటం చేసేందుకు సీవీఎస్‌కే శర్మకు అప్పటి ప్రభుత్వం సాయం అందించిన సంగతి తెలిసిందే.

అయితే.. ప్రభుత్వం నుంచి న్యాయ సహాయం పొందిన ఆయన నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు అక్రమంగా పొందారంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీవీఎస్‌కే శర్మ తప్పుడు బిల్లులు పెట్టారంటూ రమణ అనే వ్యక్తి తొలుత కోర్టును ఆశ్రయించారు. బిల్లుల విడుదల విషయంలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పీవీ రమేష్ సహకరించారని రమణ ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్ లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది. అయితే ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి మరి.