Train Derailment: ఒడిషాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గత శుక్రవారం ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే . ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనను మరిచిపోకముందే అదే ఒడిషాలో మరో గూడ్సు రైలు పట్టాలు తప్పడం కలకలం రేపింది. బర్గఢ్ జిల్లా సంబర్‌ధార వద్ద సున్నపురాయి లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పింది. బర్గఢ్‌లోని ఏసీసీ సిమెంట్ కర్మగారాంలో సున్నపురాయి గనుల నుంచి దుంగ్రీ ప్రాంతంలోని ప్లాంట్‌కి లోడు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లుగా సమాచారం లేదు.
కోరమండల్ దుర్ఘటనపై సీబీఐ విచారణ :
మరోవైపు.. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డ్ సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్, పాయింట్ మెషీన్‌లో మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది మానవ తప్పిదమా..? లేక విద్రోహమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రాక్ పునరుద్ధరణ.. అశ్విని వైష్ణవ్ భావోద్వేగం:
ఇదిలావుండగా.. బాలేశ్వర్ ప్రమాదం నేపథ్యంలో ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రైల్వే శాఖ ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. విశాఖ హార్బర్ నుంచి రూర్కెలా స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే గూడ్స్ రైలు సర్వీస్‌ను రైల్వే శాఖ నడిపింది. ఈ సమయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ఉన్నతాధికారులు అక్కడే వున్నారు. దాదాపు 51 గంటల తర్వాత ఆ ప్రాంతంలో విజయవంతంగా రైలు నడవడంతో వైష్ణవ్ భావోద్వేగానికి గురయ్యారు. భగవంతుడికి రెండు చేతులు జోడించి నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments