కరోనాతో మరో టాలీవుడ్ నిర్మాత మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలైపోతున్నారు. ఇటీవల ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ నిర్మాత కరోనా మహమ్మారికి బలయ్యారు.
స్టార్ హీరోలు నటించిన పలు చిత్రాలలో విలన్‌గా నటించిన శ్రవణ్ రాఘవేంద్రను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కరోనాతో ఆదివారం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం తనకు కరోనా నిర్ధారణ కావడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా లక్ష్మీనారాయణ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్త విని టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది.
ఇటీవల జరిగిన ‘ఎదురీత’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘ఎదురీత’ టైటిల్ తన గురించే పెట్టారేమోనన్నారు. తన జీవితమంతా ఎదురీతేనన్నారు. తాను నిర్మాత కాకముందు రూ.200 పెట్టి టికెట్ కొనుక్కుని చూడటమేననే భావన ఉండేదని.. నిర్మాత అయ్యాక టికెట్ రేటు రూ.2000 పెట్టినా తక్కువే అనిపిస్తోందన్నారు. సినిమా తీయడంలోని కష్టం అర్థమైందన్నారు. ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం శ్రవణ్ అని.. ఆయనది కూడా సిద్దిపేటేనన్నారు. తన హీరో అందించిన సహకారమే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి కారణమని లక్ష్మీనారాయణ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments