అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా..
- IndiaGlitz, [Thursday,April 04 2024]
ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. ప్రజల ఆకాంక్షల మేరకే తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నానని ప్రకటించారు.
కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి గెలిచారు. అనంతరం టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో పార్టీ మారి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరామ్ చేతిలో ఓడిపోయారు. అనంతరం కరణం బలరాం వైసీపీలో చేరడంతో ఆమంచికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనను పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు.
అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ తరపున పనిచేసుకుంటూ వచ్చారు. కానీ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన యడం బాలాజీకి సీఎం జగన్ పర్చూరు టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమంచి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటు చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో రెండు స్థానాల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి పార్టీకి రాజీనామా చేశారు.
అయితే ఇతర పార్టీల్లో కూడా ఎమ్మెల్యే సీటు వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనుభవం ఉండంటతో ఈసారి కూడా అదే విధంగా తన అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమంచి కుటుంబానికి చీరాల నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ఇటీవల ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరారు. చీరాల లేదా గిద్దలూరు స్థానాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే ఆ రెండు స్థానాలు టీడీపీకి వెళ్లాయి. దీంతో ఆయన చీరాల నియోజకవర్గ పదవికి రాజీనామా చేశారు. కానీ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో ఆమంచి బ్రదర్స్ ఇద్దరికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. మరి ఇండిపెండింట్‌గా పోటీ చేసి తమ పట్టు నిలుపుకుంటారో లేదో వేచి చూడాలి.