విశాల్‌కు వ్యతిరేకంగా మరో నిర్మాతల మండలి
- IndiaGlitz, [Tuesday,August 04 2020]
హీరో, నిర్మాత, దర్శకుడు విశాల్‌కు కరోనా కష్టాలతో పాటు కొత్త కష్టాలు మొదలయ్యాయి. విశాల్ హీరోగా సినిమాలు చేయడమే కాదు.. సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సీనియర్ దర్శక నిర్మాత భారతీరాజాకు, విశాల్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. విశాల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న సమయంలో రూ.7కోట్ల మేరకు అవినీతి జరిగిందని, ఇప్పుడున్న అధ్యక్షుడి వల్ల నిర్మాతలకు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపణలు చేస్తున్నారు భారతీరాజా. అందువల్ల తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేరిట ఓ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి రిజిష్టర్ చేయించారు.
ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలికి వ్యతిరేకంగా ఓ కొత్త నిర్మాతల మండలిని స్థాపించడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ నిర్మాతల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని భారతీరాజా తెలిపారు. నిర్మాతల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశామని భారతీరాజా తెలిపారు. మరి ఈ వ్యవహారంపై నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అండ్ టీమ్ నుండి ఎలాంటి స్పందనా లేదు. అయితే తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విశాల్ ఏమని సమాధానమిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.