సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న స్థానిక ఎన్నికలు.. హైకోర్టులో మరో పిటిషన్..

  • IndiaGlitz, [Monday,January 25 2021]

ఏపీలో స్థానిక సమరమేమో కానీ.. అంతకు మించిన సమరం ఎన్నికలకు ముందే జరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులతో.. సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కాస్తా ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌గా మారిపోయాయి. రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న వార్‌ని తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తోంది. మీడియా చర్చల మీద చర్చలు నిర్వహిస్తూ వాడి వేడి వార్తలను ప్రజానీకానికి అందిస్తూ మరింత టెన్షన్‌ను పెంచుతోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఇదో పెద్ద హాట్ టాపిక్.

ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎస్‌ఈసీ.. ప్రస్తుతమున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకూ నిర్వహించకూడదని ఏపీ ప్రభుత్వం.. రెండూ పట్టుదలకు పోవడంతో విషయం మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో సమస్య కోర్టుకెక్కింది. హైకోర్టు తీర్పు ఎస్‌ఈసీకి అనుకూలంగా వస్తే.. వెంటనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ప్రభుత్వోద్యోగులను కూడా పావులుగా వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పలికించిన పలుకులనే ఏపీ ఉద్యోగులు పలుకున్నారని.. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని చెబుతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద అటు ఎస్‌ఈసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో ఉద్యోగులు బలి పశువులవుతున్నారనడంలో సందేహం లేదు.

మొత్తానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణ సరికాదని, హైకోర్టులో గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల పిటిషన్‌ వేశారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం 2021 ఓట్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2019 జాబితా కారణంగా 3.60 లక్షల మంది యువ ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖలుకు పిటిషనర్‌ ప్రయత్నం చేశారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున హౌజ్‌మోషన్‌కు హైకోర్టు నిరాకరించింది. సోమవారం హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానుంది.