లేడీ సింగం ఆత్మహత్య కేసులో మరో అధికారి సస్పెన్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలో వేళ్లూనుకున్న స్మగ్లింగ్ ఆట కట్టించి లేడి సింగంగా గుర్తింపు పొందిన అటవీశాఖ అధికారిణి దీపాళీ చవాన్(28) ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. అయితే ఈ కేసులో సీనియర్ ఐఎఫ్ఐ అధికారి, మెల్గాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది. ఈ కేసు విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను కలిసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ నిందితుడు శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఉద్ధవ్ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్‌ను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
దీపాళీ చవాన్ గత గురువారం రాత్రి పొద్దు పోయాక అమరావతి జిల్లా మెల్గాట్ టైగర్ రిజర్వ్ సమీపంలోని తన క్వార్టర్స్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తనను ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ శివకుమార్ లైంగికంగా వేధించారని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాళీ నాలుగు పేజీల సూసైడ్ లేఖ ద్వారా వెల్లడించారు. తాను చిత్రహింసలకు గురవుతున్న విషయాన్ని మెల్గాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి వెల్లడించినా ఆయన పట్టించుకోలేదని సూసైడ్ లేఖలో దీపాళీ వెల్లడించారు. ఆమె భర్త రాజేశ్ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నారు. తన తల్లి శకుంతలతో కలిసి ఆమె క్వార్టర్స్‌లో ఉండేవారు. అయితే దీపాళీ తన తల్లి తమ స్వగ్రామమైన సతారాకు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీపాళీ తన సూసైడ్ లేఖలో వినోద్ శివకుమార్ తనను కొంత కాలంగా లైంగికంగా, మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆగడాలపై పలుమార్లు ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. విధుల్లో ఉండగానే వినోద్ శివకుమార్ మద్యం సేవించి తనను ఇష్టానుసారంగా దూషించేవాడని పేర్కొన్నారు. అతడికి లొంగకపోవడంతో తనకు కష్టమైన పనులు చెప్పడం, వేధించడంతో పాటు చివరకు తన జీతాన్ని కూడా నిలిపివేశాడని దీపాళీ ఆరోపించారు. పెట్రోలింగ్ పేరుతో గర్భవతిగా ఉన్న దీపాళీని శివకుమార్ అడవిలోకి తీసుకెళ్లడంతో ఆమెకు గర్భస్రావం అయ్యిందని దీపాళి స్నేహితురాలు వెల్లడించారు. దీంతో దీపాళి తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments