ఏపీలో మరో కొత్త పార్టీ..
- IndiaGlitz, [Sunday,November 01 2020]
ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆది నుంచి రెండు, మూడు కులాలు మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటూ.. ఆ కులాల వారికే పెద్ద పెద్ద పదవులన్నీ కట్టబెడుతూ వస్తున్నాయి. అతి పెద్ద ఓటు బ్యాంకు బీసీలదే అయినప్పటికీ వారెప్పుడూ రాజకీయ పరంగా వెనుకబడి ఉంటున్నారనడంలో సందేహం లేదు. బీసీలను రాజకీయ లబ్ధి కోసం.. ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ఏ పార్టీ కూడా పెద్ద పీట వేసిందయితే నేటి వరకూ లేదు.
ఇక ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా రెండు సామాజిక వర్గాలదే అధికారమంతా.. ఎన్నికల్లో తలపడినా ఆ రెండు సామాజిక వర్గాల మధ్యే పోటీ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇప్పటి వరకూ బీసీలను ప్రధాన ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 50 శాతమున్న బీసీ జనాభాకు ప్రాతినిధ్యం వహించే పార్టీయే లేకపోవడం గమనార్హం. దీంతో ఆదివారం బీసీ సంక్షేమ సంఘాలు గుంటూరు సమావేశమై నూతన రాజకీయ ఏర్పాటుపై చర్చించాయి.
నేడు గుంటూరు ఏపీ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జి.శ్యామ్ ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత అల్మాన్ రాజు సహా 13 జిల్లాల నుంచి బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. పదవుల పేరుతో బీసీలను చీల్చి ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. బీసీలు అంతా ఏకతాటిపై ఉండేందుకే నూతన పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు నేతలు తెలిపారు.