YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో నేత గుడ్ బై!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. టికెట్ రాని నేతలతో పాటు పార్టీలో ప్రాధాన్యత దక్కని వారందరూ పార్టీని వీడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరితో పాటు సీనియర్ నేత దాడి వీరభద్రరావు, క్రికెటర్ అంబటి రాయుడు కూడా పార్టీకి బైబై చెప్పేశారు. వీరిలో దాడి, రామచంద్రయ్య టీడీపీలో చేరగా, వంశీకృష్ణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా
ఇక తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఈసారి కర్నూలు ఎంపీగా ఆయనకు టికెట్ లేదని తెలపడంతో పార్టీని వీడారు. ఇక ఈయనతో పాటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం నేత బొమ్మసాని సుబ్బారావు.. పార్థసారథిని కలిశారు. ఈ నెల 18న గుడివాడలో జరిగే 'రా.. కదలిరా' బహిరంగసభలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లోకి ఆర్కే, రామచంద్రారెడ్డి..
ఇక జగన్ సన్నిహిత ఎమ్మెల్యేలు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పటికే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆర్కే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి కూడా అదే తీరులో ఉన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం కాంగ్రెస్ సీనియర్ నేత రఘురామిరెడ్డిని కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. త్వరలోనే షర్మిల చేత బహిరంగసభ ఏర్పాటు చేయించి కాంగ్రెస్‌లో చేరతానని ఆయన ప్రకటించారు. ఇక వైసీపీ నుంచి మూడో విడత అభ్యర్థుల జాబితా విడుదలైతే ఇంకెంతమంది పార్టీ మారతారో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు మాత్రం ఎన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments