ఆచార్య’కు సంబంధించి చిరు మరో లీక్ చేసేశారు..

సినిమాలకు సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయడమనేది చాలా ముఖ్యం. అభిమానులకు ఇలాంటి సస్పెన్స్‌లే కిక్ ఇస్తుంటాయి. ఇలాంటి సీక్రెట్స్‌ అనుకోకుండా బయటకు వస్తే.. మాత్రం ఏం చేయలేం. మైక్ పట్టుకొని అభిమానుల ముందు మాట్లాడుతుంటే సంతోషంలోనో.. తన్మయత్వంలోనో..ఆవేశంలోనో ఎప్పుడో చెప్పాల్సిన విషయాలు అలా అనుకోకుండా లీక్ చేసేస్తుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఏదైనా ఈవెంట్‌కు ఆయన హాజరవుతున్నారంటే చాలు.. అభిమానులు ఇసుకేస్తే రాలనంతగా హాజరవుతుంటారు. అంతటి అభిమాన సందోహాన్ని చూశాక చిరు ఆగుతారా? మైక్ పట్టుకుని సరదాగా మాట్లాడుతూ వెళుతుంటారు.

ఈ మధ్య చిరు అలా మాట్లాడుతూనే తన సినిమాకు సంబంధించిన సీక్రెట్స్ అన్నీ రివీల్ చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘ఆచార్య’ సినిమా విషయంలో అలా అనుకోకుండానే ఇప్పటికే రెండు సీక్రెట్స్‌ను రివీల్ చేసిన మెగాస్టార్.. తాజాగా ముచ్చటగా మూడోసారి మరో సీక్రెట్‌ను రివీల్ చేశారు. చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా ‘ఆచార్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో రాం చరణ్ కనిపించనున్నాడు. యనకి జంటగా పూజా హెగ్డే నటిస్తోందట. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్‌ని ఓ ఈవెంట్‌లో అనుకోకుండా మెగాస్టార్ రివీల్ చేశారు. ఆ తరువాత ముఖ్య పాత్రలో చెర్రీ చేయబోతున్నట్టు కూడా అనుకోకుండానే రివీల్ చేశారు. ఇక మెగాస్టార్ అనుకోకుండా బయటపెట్టిన విషయం ఏంటంటే.. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందని చెప్పేశారు. ఇప్పటి వరకూ చెర్రీ నక్సలైట్ నాయకుడిగా చేస్తున్నాడు అనుకోవడమే తప్ప చిత్ర యూనిట్ అయితే ఈ సినిమా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందని ఎక్కడా చెప్పింది లేదు. మెగాస్టార్ గురువారం ‘విరాటపర్వం’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సమయంలోనే అనుకోకుండా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘విరాట పర్వం టీజర్ చూస్తుంటే నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిందనిపిస్తోంది. మా ఆచార్య సినిమా కూడా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌’’ అని చిరు చెప్పారు.