రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. మరో భారతీయ విద్యార్ధి మృతి
- IndiaGlitz, [Thursday,March 03 2022]
ఉక్రెయిన్- రష్యా యుద్ధం భారతీయుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పటికే నిన్న ఖార్కీవ్‌లో రష్యా సైనికుల దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్ధి నవీన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌లో మరో భారతీయుడు మృతిచెందాడు. మృతుడిని పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతానికి చెందిన చందన్ జిందాల్ (22)గా గుర్తించారు. ఇతను ఉక్రెయిన్‌లోని విన్నీసియాలో మోమోరియల్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్నాడు.
ఫిబ్రవరి 2న చందన్ అనారోగ్యానికి గురవడంతో అతనిని ఆసుపత్రిలో చేర్చారు. కొడుకు అనారోగ్యానికి గురవ్వడంతో అతనిని చూసేందుకు భారత్ నుంచి చందన్ తల్లిదండ్రులు ఫిబ్రవరి 7న ఉక్రెయిన్ వెళ్లారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. అయితే ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి చందన్ మరణించినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇకపోతే.. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో మంగళవారం రష్యా జరిపిన దాడిలో నవీన్ మృతిచెందిన విషయం తెలిసిందే. సుమారు 30 మంది భారతీయ విద్యార్థులతో ఖార్కీవ్‌లోని ఓ బంకరులో ఆశ్రయం పొందుతున్న నవీన్.. బుధవారం సరుకులు తెచ్చుకునేందుకు వెలుపలకు వచ్చాడు. ఈ క్రమంలోనే రష్యా సేనల ఫిరంగి దాడిలో చిక్కుకుపోయిన నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. రష్యా, ఉక్రెయిన్ సహా పలు దేశాలు నవీన్ కుటుంబానికి సంతాపం తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అతని కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. వీలైనంత త్వరగా నవీన్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.