‘స‌లార్’లో మ‌రో స్టార్ హీరో.. ఆడిష‌న్స్ షురూ అయ్యాయి

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ అంటే కింగ్ మేకర్ అని, రాజుకు కుడిభుజంలాంటి వ్య‌క్తి అని అర్థాన్ని వివరించారు ప్రశాంత్ నీల్. దీంతో సినిమాలో ప్రభాస్ కింగ్ మేకర్ అయితే.. కింగ్ ఎవరు? ప్ర‌భాస్ ఇమేజ్‌కు త‌గ్గ స్టార్ ఎవ‌రు ఉండ‌బోతారు? అనే కోణంలో ప‌లు వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ఈ సినిమాలో న‌టించ‌బోతున్నారట‌. ఈ పాత్ర చేయ‌డానికి ఆయ‌న‌కు భారీ రెమ్యున‌రేష‌న్‌నే ఇచ్చార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కాగా.. మంగ‌ళ‌వారం(డిసెంబ‌ర్ 15)రోజున ‘స‌లార్‌’ ఆడిష‌న్స్ జరుగుతున్నాయి. ఏదైనా భాషలో ఓ నిమిషం పాటు నటించిన వీడియోతో హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీకి ఉదయం 9 నుండి 6 గంటల లోపు రావాలని నిర్మాతలు అనౌన్స్ చేశారు. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, చెన్నైలలోనూ ఆడిషన్‌ను నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. జనవరిలో సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు అనౌన్స్‌మెంట్‌ రోజునే వెల్లడించడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు.