ఏపీలో మళ్లీ ఎన్నికల సమరం.. ఈసారి ఏం జరగనుందో?

  • IndiaGlitz, [Monday,February 15 2021]

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చిన 10న ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అవసరమైన చోట మార్చి 13న రీపోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించింది. కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 3న మధ్యాహ్నం 3 గంటలలోపు తుది గడువుగా ఎస్ఈసీ నిర్ణయించింది. మార్చి 3న సాయంత్రం తుది జాబితా విడుదల చేయనుంది. రాష్ట్రంలో 75 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థలకు పోలింగ్‌ జరగనుంది.

వాస్తవానికి 2020లోనే జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. గతంలో నిలిచిన ప్రక్రియను కొనసాగించేలా ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి అర్బన్‌ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలు కానుంది. మార్చి 10న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. కాగా.. రాష్ట్రంలో విజయనగరం, విశాఖ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, కడప, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విజయవాడ నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికే ఎస్‌ఈసీకి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి ఈ ఎన్నికల విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది. తొలుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించి ఆయన స్థానంలో మరొకరిని ఏపీ ప్రభుత్వం కూర్చోబెట్టింది. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు నిమ్మగడ్డకే అనుకూలంగా వచ్చింది. కేసు సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో లాభం లేదనుకున్న ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు యత్నించింది. కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు పడ్డాయి. అన్ని అడ్డంకులు, అవాంతరాలను దాటుకుని ఫైనల్‌గా నిమ్మగడ్డ ఎన్నిలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో మరెన్ని అడ్డంకులు ఎదురు కానున్నాయో వేచి చూడాలి.