Kavitha:లిక్కర్ స్కాంలో కవితకు మరో చుక్కెదురు.. సీబీఐ కస్టడీకి అనుమతి..
Send us your feedback to audioarticles@vaarta.com
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆమెను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కవితను కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాంలో కీలక ప్రధాన సూత్రధారి కవితనేని వాదించింది. ఈ క్రమంలోనే 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా ఈ నెల 14 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు.
ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రకు సంబంధించిన కీలక విషయాలను సీబీఐ బహిర్గతం చేసింది. కవిత రూ.100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో తెలిపింది. కవిత నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థకు అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు పేర్కొంది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు వివరించింది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని వెల్లడించింది. అంతకుముందు సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది.
మనీలాండరింగ్ కేసులో ఈడీ తరపున అరెస్ట్ కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించింది. గతంలో కవితను విచారించిన సమయంలో నమోదు చేసిన స్టేట్మెంట్, అప్రూవర్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ముఖ్యంగా భూముల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ కవితను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. దీంతో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టిన తర్వాత మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది. ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. కాగా మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండగా తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి మారారు. ఇందులో భాగంగా తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర అని రూ.100కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టై తిహార్ జైలులోనే ఉంటున్నారు. మొత్తానికి ఈ కేసులో కవితకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments