మరో ప్రమాదకరమైన మహమ్మారి గుర్తింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ బుధవారం వెల్లడించారు. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పలువురు పర్యాటకులకు టెస్టులు నిర్వహించారు. వారిలో ఇద్దరికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయిందని హ్యాన్‌కాక్ వెల్లడించారు. కొత్త రకం కరోనా వైరస్ మామూలు వైరస్ కంటే 70 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడి కాగా.. తాజాగా కనుగొన్న కొత్త రకం వైరస్ అంతకు మించిన వేగంతో వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ రెండు వారాల వ్యవధిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేట్ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు హ్యాన్‌కాక్ వెల్లడించారు.
ఈ కొత్త రకం కరోనా వైరస్ కారణంగా దక్షిణాఫ్రికాలో బుధవారం ఒక్కరోజే 36 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఈ రకం వైరస్‌పై వాయువ్య ఇంగ్లాండ్‌లోని ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షలు చేయనున్నారు. యూకేలో తాము తాజాగా గుర్తించిన కొత్త రకం కొవిడ్ వైరస్.. దక్షిణాఫ్రికాలో వ్యాపిస్తున్న వైరస్ వేరియంట్ కంటే భిన్నంగా ఉందన్నారు. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి తమ దేశానికి రాకపోకలపై నిషేధం విధించినట్లు చెప్పారు. కాగా.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పటికే చాలా దేశాలకు పాకి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కొత్త స్ట్రెయిన్లోని స్పైక్ ప్రొటీన్‌లో కొన్ని జన్యుమార్పులు జరిగినా, కరోనా వ్యాక్సిన్లతో ఉత్పన్నమయ్యే రోగ నిరోధక స్పందనను ఎదురించి అవి నిలువలేవని పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాలపై లోతైన అధ్యయనంతో శక్తివంతమైన వ్యా క్సిన్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.
యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్ దేశంలో వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడిప్పుడే విదేశాల నుంచి విమానాశ్రయాలకు చేరుకుంటున్న ప్రయాణికులు, ఇటీవల విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వేలాది మందిని క్వారంటైన్ చేయడం, వారికి టెస్టులు నిర్వహించడంపై దృష్టిసారించాయి. కాగా.. ఈ కొత్త స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్‌కు సైతం పాకిందని తాజాగా వెల్లడైంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కొత్త కరోనా వైరస్ సోకిందని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె పరీక్షల ఫలితం వచ్చే వరకూ నిరీక్షించకుండా.. కొడుకుతో కలిసి ఢిల్లీ నుంచి పరారై ఏపీకి చేరుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఏపీలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments