ముంచుకొస్తున్న మరో తుపాను..
- IndiaGlitz, [Thursday,May 20 2021]
ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమతీరాన్ని వణికించిన ‘తౌక్టే’ తుపాను కాస్త బలహీన పడిందని ఆనందిస్తున్న తరుణంలో విశాఖ వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. తూర్పు తీరాన్ని వణికించేందుకు మరో తుపాను ముంచుకొస్తోందట. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26న బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
Also Read: గాలి ద్వారా కరోనా.. ఇలా చెక్ పెట్టవచ్చు..
యాస్‌గా నామకరణం..
ముంచుకు రానున్న తుపానుకు 'యాస్' గా నామకరణం చేశారు. ఇది తుఫానుగా మారితే తూర్పు తీరంపైనే అధికంగా ప్రభావం చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని బంగాళఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ అన్నారు. ఈ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు రాజీవన్ అన్నారు. అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది.
రుతుపవనాల ఆగమనానికి ముందు..
ఈ నెల 22న ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇటు ఆంధప్రదేశ్ తీర ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. సాధారణంగా రుతుపవనాల ఆగమనానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపానులు ఏర్పడుతుంటాయి. గతేడాది మే నెలలో అంఫన్, నిసర్గ తుపానులు తీర రాష్ట్రాల్లో పెను బీభత్సం సృష్టించింది. ఈ ఏడాది సైతం మే నెలలో తుపానులు విరుచుకుపడుతున్నాయి.