ఎస్ఈసీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం.. మరో వివాదం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా అయితే కనిపించట్లేదు. అంతా కూల్ కూల్ అనుకుంటున్న తరుణంలో మరోమారు వివాదం తలెత్తినట్టు సమాచారం. తాజాగా ఎన్నికల సంఘం కార్యదర్శి విషయంలో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి రవిచంద్రను నియమిస్తూ నిన్న సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు కూడా పంపారు. ఆ తర్వాత రవిచంద్రను వైద్య ఆరోగ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కోవిడ్ టీకాల కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
హడావుడిగా దీని కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా కార్యదర్శి పోస్టును ప్రభుత్వం సృష్టించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎస్ఈసీ రవిచంద్రను నియమించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టుకు ముగ్గురు అధికారులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐఏఎస్ అధికారులు రాజబాబు, కన్నబాబు, విజయకుమార్ల పేర్లను ప్రభుత్వం సూచించింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారులను కాకుండా నిమ్మగడ్డ రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే ప్రభుత్వం వైద్య ఆరోగ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్ఈసీ కార్యదర్శిగా ఉన్న వాణిమోహన్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ గతంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎస్ఈసీ కార్యదర్శి పోస్టు అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యదర్శి లేకపోవడం కమిషన్ పనితీరుపై ప్రభావం చూపుతోందని ముగ్గురు అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోస్టింగ్ కోసం ఎదురుచూసిన రవిచంద్రను కార్యదర్శిగా నియమిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం రవిచంద్రను వేరే పోస్టులో నియమించిన అనంతరం ముగ్గురు అధికారుల పేర్లను ఎస్ఈసీకి సూచించడం గమనార్హం. దీనిపై ఎస్ఈసీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments