BRS:బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
- IndiaGlitz, [Friday,May 03 2024]
తెలంగాణ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోవడంతో క్యాడర్ నిరుత్సాహంతో ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మరో షాకింగ్ న్యూస్ ఆ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. గులాబీ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికల చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా రూ.50,000లు జరిమానా విధించింది.
అసలు ఏం జరిగిందంటే.. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా దండే విఠల్ నామినేషన్ వేశారు. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించేందుకు ఆయన సంతకం విఠల్ పోర్జరీ చేశారు. రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దాంతో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన రాజేశ్వర్ హైకోర్టును ఆశ్రయించారు.
తాను నామినేషన్‌ను ఉససంహరించుకోలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు తెలిపారు. దండే విఠల్ ఎన్నిక చెల్లదని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం .. నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకం పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిది కాదని తేల్చింది. దీంతో విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. కాగా ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసిన విఠల్ 667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.