Guvvala Balaraju: గువ్వల బాలరాజుపై మరోసారి దాడి.. కాంగ్రెస్ కుట్రే అంటున్న గులాబీ నేతలు..

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇటీవల అచ్చంపేట ప్రచారంలో బాలరాజుపై కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరారు. ఆ దాడిలో గాయపడిన బాలరాజు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి బాలరాజును పరామర్శించారు.

చికిత్స నుంచి కోలుకున్న బాలరాజు సోమవారం రాత్రి నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలుకుతూ భుజాలపైకి ఎత్తుకున్నారు. ఈ క్రమంలో జనంలో నుంచి ఓ వ్యక్తి బాలరాజుపై ఇటుక రాయి విసిరేయడంతో ఆయన మోచేతికి తగిలి గాయమైంది. వెంటనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. బాలరాజుపై దాడి చేసింది తిరుపతయ్య అనే వ్యక్తి అని.. అతనికి మతిస్థిమితం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

బాలరాజుపై వరుస దాడులు కాంగ్రెస్‌ నేతల కుట్రే అని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు. అయితే గులాబీ నేతల ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒడిపోతున్నామనే భయంతో దాడుల కుట్రకు తెరలేపారని ఆరోపణలు చేస్తు్న్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపిస్తోంది.