Election Schedule: రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. కౌంట్‌డౌన్‌ షూరూ..

  • IndiaGlitz, [Friday,March 15 2024]

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు సీఈసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

ప్రస్తుతం ఉన్న 16వ లోక్‌సభ గడువు జూన్‌ 16తో ముగియనుంది. అలాగే ఏపీ సహా మిగిలిన మూడు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే నెలతో ముగుస్తోంది. దీంతో మే నెల లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల బృందం స్థానిక రాజకీయ పార్టీలు, అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. కాగా గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు కొద్దిసేపటి క్రితమే నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్‌లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. వీరి బాధ్యతల స్వీకరణతో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సభ్యులతో నిండిపోయింది. నూతన ఈసీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేసుకున్న సీఈసీ శనివారం అధికారిక ప్రకటన చేయనుంది. మొత్తానికి యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు కౌంట్‌డౌన్ షూరూ అయింది.

ఇదిలా ఉంటే 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటివరకు 267 మంది ఎంపీ అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా.. కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాయి.