Pawan Kalyan: సీఎం అభ్యర్ధిగా పవన్‌ని ప్రకటించండి .. జేపీ నడ్డాను కోరిన జనసేన నేత పోతిన మహేశ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెర దించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వస్తున్న ఆయన... ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై స్పష్టత ఇవ్వాలని మహేశ్ కోరారు.

గందరగోళానికి చెక్ పెట్టండి:

జేపీ నడ్డాకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని.. రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేశామని... మంచి ఓటు బ్యాంకు కూడా సాధించామని పోతిన మహేశ్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధి పవన్ కళ్యాణేనని అనధికారంగా ప్రచారం సాగుతోందని ఆయన తెలిపారు. దీని వల్ల ఇరు పార్టీల నాయకులతో పాటు ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై నడ్డా స్పష్టత ఇస్తే బాగుంటుందన్నారు. ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ని ప్రకటిస్తే ఇరు పార్టీల మైత్రి బలపడి, ప్రజల మద్దతు మరింత లభిస్తుందని పోతిన మహేశ్ అభిప్రాయపడ్డారు.

వైసీపీ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి:

వైసీపీ దాష్టీకాలను అరికట్టి, ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపించాలంటే బీజేపీ, జనసేన పార్టీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలని పోతిన మహేశ్ అన్నారు. దీనికోసం ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణను నడ్డా ప్రకటిస్తే బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని బీజేపీ పెద్దలు కూడా ఇష్టపడటం లేదని పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని... పోలవరం, ఉపాధి హామీ పథకం నిధులు భారీగా దారి మళ్లించారని పోతిన మహేశ్ ఆరోపించారు.

పోలవరంలో అక్రమాలు జరిగాయని కేంద్రమంత్రే చెప్పారు:

రైతు భరోసా నిధులు, ధాన్యం కొనగోలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రకటనలు చేసుకుంటోందని.. దీనిపై నడ్డా ప్రజాక్షేత్రంలో జగన్ ప్రభుత్వ తీరును.. అవినీతినీ, అసమర్థతను ఎండగట్టాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధులను పక్కదారి పట్టించి వేలకోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టులో అక్రమాలు, లోపాలు ఉన్నాయని, నిధులు భారీగా మళ్లింపు జరిగాయని పార్లమెంట్ వేదికగా ఆయన ప్రకటించారని పోతిన మహేశ్ పేర్కొన్నారు. నిధుల గోల్ మాల్, మళ్లింపుపై ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చేలా ఈ పర్యటనలో నడ్డా మాట్లాడతారని ఆయన ఆకాంక్షించారు.