ఆయన వల్ల 'అన్నయ్య' ఇబ్బంది పడ్డారు.. నీ బతుకెంత!
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ.. దగాకోరు రాజకీయాలకు ఎదురెళ్తానన్నారు. పీఆర్పీ పెట్టిన సమయంలో ఈ వైసీపీ చెంచా కన్నబాబు దగ్గర డబ్బు లేదు. ఏదో కష్టపడి చిన్న ఉద్యోగం చేసుకునే వాడు. అన్నయ్యకు నేను, నాగబాబు పరిచయం చేశాం. పక్కన కూర్చుని అన్నయ్యకు సలహాలు ఇవ్వాల్సినవాడు.. దొడ్డిదారిన సీటు దక్కించుకున్నాడు. జ్యోతుల వెంకటేశ్వరరావుకి రావాల్సిన సీటును అందరి కళ్లుగప్పి అడ్డదారిలో తెచ్చుకున్నాడు. కన్నబాబు లాంటి అధములు పక్కన చేరి చేసిన పనుల వల్ల చిరంజీవి ఇబ్బందులు పడ్డారు. మా దగ్గర ఎదిగి మాకు ద్రోహం చేసిన ఇలాంటి వారే పీఆర్పీని కాంగ్రెస్‌లో కలిపేందుకు దోహదం చేసింది. పీఆర్పీలో ఉన్నప్పుడు ఒకసారి వైఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలను తిడితే ఇదే కన్నబాబు పారిపోయాడు. అంత ధైర్యవంతుడు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అంటే కన్నబాబు పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
నువ్వెంత.. నీ బతుకెంత..!?
కులం పేరు చెప్పుకుని ఎదిగి అదే కులానికి ద్రోహం చేసే ఇలాంటి వారిని కాన్షీరాం చెంచా అంటారు. చెంచా కన్నబాబు.. నా ముందే వేషాలు వేస్తావా. జనసైనికుల్ని బెదిరిస్తావా.? నువ్వెంత నీ బతుకెంత..? ఎక్కడి నుంచి వచ్చావు..? ఏ ఊరి నుంచి ఇక్కడికి వచ్చావు..? మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మనిషన్నాక కాస్త సిగ్గు, పౌరుషం, లజ్జ ఉండాలి. వైఎస్ కుటుంబీకులు మాకు కొట్టిన దెబ్బ నేను ఎప్పటికీ మర్చిపోను. మా ఆడబిడ్డలు ఏమైనా రోడ్ల మీద వస్తువులా.? మీరు మీ కుటుంబాలు పదిలంగా వుండాలి. మా జీవితాల్ని మాత్రం రోడ్ల మీద పడేయండి. అలాంటి వారి దగ్గరకు.. అన్నయ్య గారు ఎంతో విలువ ఇచ్చిన కన్నబాబు, వంగా గీత వెళ్లి చేరితే ఏమనాలి. ఆ గట్టున తిని వేరే గట్టుకు వెళ్లేందుకు సిగ్గు ఉండాలి. వేల కోట్లు ఉండి అన్ని రంగాల్లో ముందుండి చిరంజీవి గారి లాంటి వ్యక్తులు ముందుకు వస్తే.. నాశనం చేసిన వ్యవస్థ ఇక్కడ ఉంది. అందుకే నేను ఇలాంటి వారి మీద ఆధారపడి నేను రాజకీయాల్లోకి రాలేదు. నా కోపం నా ఒక్కడి గురించి కాదు. మాలాంటి వారే ఇబ్బందులుపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.