పవన్ కోసం.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి 'అన్నయ్య'!
- IndiaGlitz, [Sunday,January 27 2019]
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఇన్నాళ్లు కామెడీ షోలు, యూ ట్యూబ్‌కే పరిమితమైన నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ‘తమ్ముడు’ పవన్ కల్యాణ్ కోసం నేను సైతం అంటూ ‘అన్నయ్య’ రాజకీయ రణరంగంలోకి దిగారు. ఓ వైపు జనసేన అధిపతి పవన్ బహిరంగ సభలు, జిల్లాల్లో పర్యటనలతో బిజీబిజీగా గడుపుతుంటే.. మరోవైపు నాగబాబు తనవంతుగా పార్టీకోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే కోస్తా ఆంధ్రలోని అన్ని జిల్లాల్లో పవన్ పర్యటన అయిపోయింది. దీంతో మరోసారి జిల్లా స్థాయిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ ఈ 2019 ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? జనాలను మనవైపు తిప్పుకోవాలి..? అనే విషయాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
పవన్ ఇంత చేస్తున్నా ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరొచ్చి జనాల్లోకి తిరిగలేదు. ఆయన కుటుంబీకులే పట్టించుకోలేదు.. ఇక జనాలేం పట్టించుకున్నారన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తాయి. దీంతో ఇలాంటి విమర్శలకు మరోసారి తావివ్వకుండా.. పైగా ఎన్నాళ్ల నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నాగబాబు ఎట్టకేలకు రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత మూడ్రోజులుగా తూర్పుగోదావరి పర్యటనలో బిజీబిజీగా నాగబాబు జిల్లాస్థాయి కార్యకర్తలు, మెగా అభిమానులు, పవన్ అభిమానులతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేయడం మొదలుపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తయిన తర్వాత ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని నాగబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలయ్య, మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇలా వరుసగా వీరిని టార్గెట్ చేస్తూ గత కొద్దిరోజులుగా నాగబాబు.. జనాల నోళ్లలో మెదిలారు. బాలయ్యతో ప్రారంభమైన యూట్యూబ్ వీడియోలు.. ఇప్పుడు వైఎస్ జగన్ వరకూ వచ్చాయి. అయితే రేపొద్దున సీఎం చంద్రబాబు వరకు ఈ వీడియోలు వెళ్లిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అయితే పవన్, నాగబాబు పర్యటనతో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. అదే ఉత్సాహంతో రేపొద్దున ఓటేసేటప్పుడు ‘గాజు గ్లాసు’ వరకు వెళ్తుందా లేదా చూడాల్సి ఉంది. కాగా.. ఇంత వరకూ నాగబాబు చేసిన ఆ యూట్యూబ్ వీడియోలు అసలు జనసేనకు ప్లస్ అవుతాయా..? లేకుంటే అట్టర్‌ప్లాప్ చేస్తాయా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.