అమల సభ్యురాలిగా జంతు సంరక్షణ మండలి..
- IndiaGlitz, [Saturday,April 30 2016]
నాగార్జున సహకారంతో అమల బ్లూక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలుగా జంతువులను సంరక్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బ్లూక్రాస్ లో ఎమర్జెన్సీ వార్డ్ ను నాగార్జున ప్రారంభించారు. దీంతో బ్లూక్రాస్ పూర్తి స్ధాయి జంతువుల హాస్పటల్ గా మారింది. ఇదిలా ఉంటే...తెలంగాణ ప్రభుత్వం బ్రూక్లాస్ వ్యవస్ధాపకురాలు అక్కినేని అమల సభ్యురాలుగా జంతు సంరక్షణ మండలిని ఏర్పాటు చేసింది.
ఈ మండలిని ఏర్పాటు చేస్తూ..శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా ఉత్తర్వులిచ్చారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ మండలిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపి, చెన్నైకి చెందిన భారత జంతు సంక్షేమ మండలి ఛైర్మెన్ సహా 13 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. సభ్యల కన్వీనర్ గా పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఉంటారు. అనధికారిక సభ్యుల్లో అమలతో పాటు స్వామి స్వయం భగవాన్ దాస్, వైల్డ్ లైఫ్ ప్రచార మేనేజర్ సి.సంయుక్త, జంతు సంక్షేమ ఉద్యమకారుడు శ్యాంసుందర్ అగర్వాల్ పీలా రామకృష్ణ మెమోరియల్ జీవరక్ష సంఘానికి చెందిన సతీష్ ఖండేవాల్ తదితరులున్నారు. మొత్తం 21 మందితో ఏర్పాటైన ఈ మండలి పీసీఎ చట్టం 1960ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది.