అలా అనిపించినప్పుడు దాసరి గారిలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాను - డైరెక్టర్ అనిల్ రవిపూడి
Send us your feedback to audioarticles@vaarta.com
పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై...తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు అనిల్ రవిపూడి. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా అనిల్ రవిపూడి తెరకెక్కించిన చిత్రం సుప్రీమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా సుప్రీమ్ ఈనెల 5న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సుప్రీమ్ డైరెక్టర్ అనిల్ రవిపూడి తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ చిత్రానికి సుప్రీమ్ అని టైటిల్ పెట్టడానికి కారణం..?
ఈ చిత్రంలో హీరో సాయిధరమ్ తేజ్ టాక్సీ డ్రైవర్. టాక్సీకి ఏదైనా పేరు పెట్టాలి. ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచించి సుప్రీమ్ అయితే బాగుంటుందని పెట్టాం. సుప్రీమ్ అనే టాక్సీ తో రైడ్ చేసే హీరో కాబట్టి సుప్రీమ్ హీరో. ఇందులో టాక్సీ కూడా ముఖ్యపాత్ర పోషించింది. సినిమాకి యాప్ట్ గా ఉంటుందని సుప్రీమ్ టైటిల్ గా పెట్టాం.
సుప్రీమ్ కాన్సెప్ట్ ఏమిటి..?
రామాయణంలో హనుమంతుడు వాయువేగంతో శ్రీరాముడు కోసం వెళ్తాడు. మా సినిమాలో హనుమంతుడు లాంటి టాక్సీ డ్రైవర్ ఎవరి కోసం జర్నీ చేసాడనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇంతకు మించి కథ గురించి నేను చెప్పలేను. తెర పై చూడాల్సిందే.
కథ అనుకున్నాక తేజును సెలెక్ట్ చేసారా..? తేజు కోసమే ఈ కథ రెడీ చేసారా...?
ముందు కథ రెడీ చేసిన తర్వాతే తేజును అనుకున్నాం. తేజు హీరో అనుకున్నాకా...ఇక కథలో ఎలాంటి మార్పులు చేయలేదు.
హీరోయిన్ రాశీ ఖన్నా మీ నెక్ట్స్ మూవీలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే చేస్తానంటుంది..ఏం మాయ చేసారు..?
నేను ఏ మాయ చేయలేదండీ..(నవ్వుతూ...) కొంత మంది అలా కనెక్ట్ అవుతారు. నా వర్కింగ్ స్టైల్...నచ్చి అలా చెప్పింది అనుకుంటున్నాను. ఇక రాశీ ఖన్నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే.... ఈ చిత్రంలో బెల్లం శ్రీదేవిగా చాలా బాగా నటించింది. రాశీ చేసిన కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
సెంటిమెంట్ కోసమా...పటాస్ హీరోయిన్ శృతి తో ఐటమ్ సాంగ్ చేయించారు..?
సెంటిమెంట్ కోసం కాదండీ...ఈ చిత్రంలో ఓ సందర్భంలో ఐటం సాంగ్ వస్తుంది. ఎవరితో ఈ సాంగ్ చేయిస్తే బాగుంటుంది అనుకుంటుంటే...పటాస్ హీరోయిన్ శృతి తో చేయిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. శృతి కూడా చేస్తానంది. అలా శృతితో సాంగ్ చేసాం. అంతే కానీ..కావాలని సెంటిమెంట్ కోసం చేయలేదు.
పటాస్ లో బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ చేసారు...సుప్రీమ్ లో చిరంజీవి సాంగ్ రీమిక్స్ చేసారు..సెంటిమెంటా..?
సెంటిమెంట్ కాదండీ...నేను 1980లో పుట్టాను. 1980 - 1990 టైమ్ లో వచ్చిన పాటలు నాకు బాగా ఇష్టం. అందుచేత అప్పుడు వచ్చిన పాటలు నా నరనరాల్లో జీర్ణించుకోపోయాయి. ముఖ్యంగా అప్పట్లో బ్రేక్ డాన్స్ సాంగ్స్ వచ్చేవి. ఆ బ్రేక్ డాన్స్ సాంగ్స్ వచ్చి చాలా రోజులు అయ్యింది. మళ్ళీ ఆడియోన్స్ కి బ్రేక్ డాన్స్ చూపించాలని తేజు తో ఆ ప్రయత్నం చేసాం. అంతే..కానీ సెంటిమెంట్ కాదండి.
ఓరిజినల్ సాంగ్ తో పోలిస్తే... రీమిక్స్ సాంగ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు..?
చిరంజీవి గారు, రాధా గారు డాన్స్ తో ఎవరూ మ్యాచ్ చేయలేరు. మేము కనీసం 50% మ్యాచ్ చేయాలనుకున్నాం. 70% మ్యాచ్ అయ్యేలా చేసాం అనుకుంటున్నాను.
సుప్రీమ్ హైలైట్ ఏమిటి..?
ఈ చిత్రం చివరి ఇరవై నిమిషాల్లో ఓ అద్భుతమైన సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసిన ఆర్టిస్టులు లైఫ్ రిస్క్ చేసి నటించారు. ఆ ఆర్టిస్టులు ఎవరు..? ఆ సీన్ ఏమిటి అనేది పూర్తిగా చెప్పడం కంటే థియేటర్లో చూస్తే థ్రిల్ ఫీలవుతారు. సినిమా తర్వాత ఈ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు అనుకుంటున్నాను. ఇది చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది.
బాలకృష్ణ 100వ చిత్రంగా రామారావు అనే టైటిల్ తో సినిమా చేయాలనుకున్నారు కదా..?
బాలకృష్ణ గారి 100వ చిత్రాన్ని చేయాలని ప్రయత్నించాను. అయితే ఏప్రిల్ కి పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయమన్నారు. నేను సుప్రీమ్ బిజీలో ఉండడం వలన కుదరలేదు. చారిత్రాత్మక కథాంశంతో బాలకృష్ణ గారు వందో చిత్రం చేస్తుండడం ఆనందంగా ఉంది. భవిష్యత్ లో అవకాశం వస్తే బాలకృష్ణ గారితో సినిమా చేస్తాను.
మీలో మంచి నటుడు ఉన్నాడని తెలిసింది...భవిష్యత్ లో నటిస్తారా..?
మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను...దర్శకుడిగా నా లైఫ్ అయిపోయింది అని అనిపించినప్పుడు దాసరి గారిలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాను.
తదుపరి చిత్రం గురించి..?
లైన్ రెడీగా ఉంది. సుప్రీమ్ రిజల్ట్ ను బట్టి ఎవరితో ఉంటుంది అనేది తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments