ఆఖరి నిమిషంలో అనిల్ కుమార్‌కు మంత్రి పదవి

  • IndiaGlitz, [Friday,June 07 2019]

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డా. అనిల్ కుమార్ యాదవ్‌ను మంత్రి పదవి వరించింది. శుక్రవారం సాయంత్రం వరకు చివరి వరకు నెల్లూరు జిల్లాలకు చెందిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డికి ఐటీ శాఖ అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. ఆఖరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా అనిల్ పేరు ఫిక్స్ అయింది. చివరకు అనిల్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్టు.. వైసీపీ కీలకనేత విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అనిల్ అభిమానులు, అనుచరులు స్వీట్లు పంచి.. బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. గత కొంతకాలంగా అనిల్‌కు మంత్రి పదవి వస్తుందన్న ఆశాభావంతోనే ఆయన వర్గీయులు ఉన్నారు. కాగా.. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి మంత్రి పదవి వరించడం ఇదే మొదటిసారి.

కాగా.. నెల్లూరు సిటీ నుంచి మూడుసార్లు చేసిన అనిల్ కుమార్ యాదవ్ మొదటిసారి కేవలం 90 ఓట్ల తేడాతో ఓటమిచెందగా.. 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కోటీశ్వరుడు, నారాయణ స్కూల్స్ అధినేత నారాయణపై పోటీచేసిన అనిల్ గెలిచి నిలిచారు. నారాయణ ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ.. ఓటమిచెందారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం.. పైగా మాస్ లీడర్‌గా పేరుగాంచిన నేతగా.. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వైఎస్ జగన్‌ కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే అనిల్‌కు ఏ శాఖ కేటాయిస్తారు..? విద్యాశాఖ ఇస్తారా..? లేక వైద్య శాఖ ఇస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.