Pawan kalyan : పవన్ కల్యాణ్‌కు షాక్.. ‘‘మూడు పెళ్లిళ్ల’’పై ఏపీ మహిళా కమీషన్ నోటీసులు, జనసేనాని స్టెప్ ఏంటో..?
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ గర్జన సభ తర్వాత జనసేన- వైసీపీలు ఏపీ రాజకీయాల్లో నేరుగా తలపడుతున్న సంగతి తెలిసిందే. మంగళగిరి ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం... వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ అన్న మాటలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. దీంతో పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తోడు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి జనసేన కూడా ధీటుగానే బదులిస్తోంది. సరిగ్గా అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీకావడం కూడా కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఉమ్మడిగానే పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చినట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ- జనసేన రాజకీయం కొత్త మలుపు తిరిగింది.
‘స్టెప్నీ’ అన్న మాట ఎలా అంటారు:
పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనేలా మీరు మాట్లాడిన మాటలు.. సమాజంలో పెద్ద దుమారం రేపాయని పద్మ పేర్కొన్నారు. మీ వ్యాఖ్యలతో మహిళా లోకం షాక్‌కు గురైందని.. వెంటనే సంజాయిషీ ఇస్తారని తాము ఎదురుచూశామని, కానీ మీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పద్మ అన్నారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూపోతే.. మహిళల జీవితానికి భద్రత ఎలా వుంటుందని కమీషన్ ప్రశ్నించింది. ఒక సినీ హీరోగా, రాజకీయ పార్టీ అధినేతగా మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలు సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. అలాగే మీ ప్రసంగంలో స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయమని... మహిళను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారే ఇలాంటి మాటలు మాట్లాడతారంటూ ఆమె మండిపడ్డారు. మరి మహిళా కమీషన్ నోటీసులపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
వాళ్లని కూడా 3 పెళ్లిళ్లు చేసుకోమనండి: పవన్
ఇకపోతే.. తరచుగా తన మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ విశాఖలో కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు కుదరకనే 3 పెళ్లిళ్లు చేసుకున్నానని.. వీటిపై మాట్లాడుతున్న వారిని చూస్తుంటే, తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. వారిని కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్లిళ్లు చేసుకోమనండి అంటూ పవన్ తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments