ఏపీలో పల్లె పోరుకు పిలుపు.. జరిగేనా.. నిలిచేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ పల్లెపోరుకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 17న ముగియనుంది. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్, ఫలితాల ప్రకటన... ఉప సర్పంచి ఎన్నిక జరుగుతుందని నిమ్మగడ్డ వెల్లడించారు. శుక్రవారం రాత్రి దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో శనివారం నుంచే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వస్తుందని ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకటించడానికి ముందు ఆసక్తికర పరిణామం..
కాగా.. ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ ముప్పు పొంచి ఉన్న కారణంగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని స్పష్టం చేసింది. అయితే భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను నిమ్మగడ్డ విడుదల చేశారు. దీనిపై ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాల్సిన అవసరమేంటనేది నిమ్మగడ్డ వివరించారు. వివిధ పార్టీలతో సమావేశానంతరమే ఈ నిర్ణయానికి వచ్చినట్టు నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం..
మొత్తానికి ఇప్పటికి షెడ్యూల్ అయితే వచ్చేసింది. కానీ ఈ ఎన్నిక జరుగుతుందా.. లేదా? అనే దానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. దీనికి కారణం ప్రభుత్వం చూపిస్తున్న అడ్డంకులే. గతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం అదే కరోనాను బూచిగా చూపించి ఎన్నికలను అడ్డుకుంటోంది. అప్పట్లో కరోనా కేసులు, సెకండ్ వేవ్‌ను కారణంగా చూపిన సర్కారు... ఇప్పుడు టీకా కార్యక్రమం ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కుదరదంటోందని ఎస్‌ఈసీ తన ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పదవీకాలం (మార్చి 31వ తేదీ) ముగిసేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదన్నదే ప్రభుత్వ అభిప్రాయమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల ప్రకటన..
తమ వల్ల కాని పక్షంలో ఉద్యోగ సంఘాల ద్వారా ఎన్నికలను జరగనివ్వకుండా చూసేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వినబడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. నేడు.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఉద్యోగులు, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. ఎన్నికల కమిషన్‌కు తాము సహకరించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనినంతటినీ చూస్తే ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కానీ.. అధికారులు కానీ ఏమాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments