పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ విజ్ఞప్తిని తోసి పుచ్చి ఎన్నికల కమిషన్ తొలి విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ తొలి విడతలో భాగంగా 14 లేదా 15 డివిజన్లలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. విజయనగరం.. ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సుప్రీం తీర్పును తక్షణమే పాటిస్తామన్నారు. హైకోర్టు తీర్పు సహేతుకమేనన్నారు. ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించిందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉంటాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం.. ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్టు నిమ్మగడ్డ స్పష్టం చేశారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని.. దానిలో సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో పాల్గొనాలని కోరారు. పంచాయతీ రాజ్ కమిషనర్ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉందని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందన్నారు. కొత్త ఓటర్ల జాబితాను సిద్దం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని నిమ్మగడ్డ తెలిపారు. పీఆర్ కమిషనర్‌పై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవని... ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదని... సీఎస్ తనకు రాసిన లేఖ తన కంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్నప్పటికీ కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
తొలి విడత ఎన్నికల తేదీలివే...
తొలి విడతకు జనవరి 25 నుంచి నామినేషన్లు
జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
జనవరి 28న నామినేషన్ల పరిశీలన
జనవరి 28న అభ్యంతరాల పరిశీలన
జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 5న పోలింగ్.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్
ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout