ఏపీ మునిసిపల్ రిజల్ట్.. ముచ్చటగా 3 రాజధానులకు ఓకే చెప్పేశారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో జరిగిన మునిసిపల్ ఎన్నికల పర్వం ముగిసింది. ఫలితం దాదాపు అధికార వైసీపీకే అనుకూలంగా వచ్చింది. మూడు రాజధానుల ఎఫెక్ట్ ఏమైనా చూపుతుందేమోనని భావించి ప్రతిపక్ష పార్టీకి చుక్కెదురైంది. అసలు ఏపీ మునిసిపల్ రిజల్ట్ ఇస్తున్న సంకేతాలేంటి? ముచ్చటగా మూడు రాజధానులకు ఓకే చెప్పేశారా? మహా మహా టీడీపీ నేతలు సైతం ఎందుకు సతికలబడాల్సి వచ్చింది. జిల్లా మొత్తం తమ గుప్పిట్లోనే ఉందన్నట్టుగా భావించిన నేతలు చివరకు ఏం అర్థం చేసుకున్నారు? వైసీపీ నేతల అధికార బలం... టీడీపీ నేతల్లో కొరవడిన సమన్వయం.. అంటూ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వైసీపీ నేతలు అధికార బలాన్ని ప్రయోగించినా.. టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడినా.. కనీసం అమరావతి రాజధానిగా ఉండాలని గట్టిగా తలిచే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజానీకం సత్తా చాటాల్సిన సమయమిదే కదా.. నిజానికి వైసీపీకి వ్యతిరేక ఫలితం రావాలి కదా.. రాలేదు సరికదా.. గుంటూరు, విజయవాడ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి.
ఇప్పుడు వైసీపీ.. ఈ విజయాన్ని మునిసిపల్ విజయంగా కంటే మూడు రాజధానులకు అనుకూలంగా వచ్చిన తీర్పుగానే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇక దీనిపై ప్రతిపక్షం కూడా నోరు మెదపలేని పరిస్థితి. కాదనడానికి కూడా ప్రతిపక్షానికి మాటల్లేకుండా పోయాయి. రాష్ట్రమంతా ఫలితం ఎలా ఉన్నా విజయవాడలో ఎంపీ కేశినేని నాని తన హవా కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ కేవలం 12 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ టీడీపీ నేతల్లో ఏమాత్రం సమన్వయం లేదు. అయితే ఎక్స్‌అఫిషియో బలంతోనైనా టీడీపీ విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ... ఇక్కడా తెలుగుదేశానికి నిరాశే ఎదురైంది. నగరానికి చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దేవినేని అవినాశ్ కూడా తన సత్తా చాటుకునేందుకు ఈ ఎన్నికలను ఓ వేదికగా చేసుకున్నారు. అందరూ కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు రాష్ట్ర మంత్రులందరూ విజయవాడపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. దీంతో సునాయసంగా వైసీపీ విజయం సాధించింది.
గుంటూరులోనూ వైసీపీ సత్తా చాటడం విశేషం. నిజానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న బలమైన ఆయుధం ‘అమరావతి’. దీనిని కూడా టీడీపీ వాడుకోలేక పోయింది సరే. గుంటూరు ప్రజానీకానికి అంత బలమైన ఆకాంక్షే ఉంటే వైసీపీకి సినిమా చూపించాలి కదా.. అదేమీ లేదంటే రాజధాని ఏదైనా తమకు ఓకే అనా? కేవలం టీడీపీ 9 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక గుంటూరు నగరపాలకసంస్థలో జనసేన-బీజేపీ అభ్యర్థులు 42 స్థానాల్లో పోటీ చేశారు. ఫలితాలను విశ్లేషించగా.. 12 డివిజన్లలో వైసీపీకి వచ్చిన ఆధిక్యతకంటే జనసేన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. మరోవైపు విశాఖ.. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఇబ్బందికరంగా పరిణమించింది. కానీ ఇక్కడ కూడా టీడీపీ సత్తా చాటలేకపోయింది. అయితే గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టుగా విజయవాడ, గుంటూరుతో పోల్చితే మంచి ఫలితాలనే సాధించగలిగామన్న తృప్తి మాత్రం టీడీపీకి మిగిలింది. మొత్తానికి వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసి.. వార్ వన్‌సైడ్ చేసేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout