ఏపీలోనూ మార్చి 31 వరకు లాక్‌డౌన్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కీలక ప్రకటన చేశారు. ఇవాళ కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో భయానక వాతావరణం నెలకొని ఉందన్నారు. ఏపీలో పరిస్థితి అదుపులో ఉన్నా, ఇతర రాష్ట్రాల పరిస్థితులు, దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వరకు లాక్ డౌన్ విధించక తప్పడంలేదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వినియోగించుకోవచ్చని సూచించారు. అది కూడా ఆటోలు, ఇతర వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోరాదని స్పష్టం చేశారు. బట్టల దుకాణాలు, బంగారం షాపులు వంటివి ఈ నెల 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోదాంలు, ఆఫీసులు ముఖ్యమైన సిబ్బందితోనే నడపాలని తెలిపారు.
ఇప్పటి వరకూ ఏపీలో..
‘ఇతర రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏపీలో తక్కువగా ఉందంటే అది అందరి కృషి ఫలితమే. ఏపీలో 6 కరోనా కేసులు ఉంటే వారిలో ఒకరు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లిపోయారు. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి కరోనా బాధితులున్నారేమోనని వివరాలు సేకరించి, యాప్ ద్వారా వైద్య విభాగంతో పంచుకున్నారు. ఆ సమన్వయం ఫలితంగా కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచాం. విదేశాల నుంచి వచ్చిన 11,670 మందికి స్క్రీనింగ్ నిర్వహించాం’ అని జగన్ స్పష్టం చేశారు.
ఇంట్లోనే ఉండండి..
‘మున్ముందు కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయి. ఒకరితో ఒకరు కలవడం తగ్గించడం వల్లే కరోనా వ్యాప్తి తగ్గిపోతుంది. అదృష్టవశాత్తు ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదు. దీని పరిధి మూడు అడుగులు మాత్రమే. ఈ కనీస జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండగలిగితే దీన్ని పారద్రోలవచ్చు. వృద్ధులు ఎవరూ గడప దాటి బయటికి రావొద్దు. 10 మంది కంటే ఎక్కువ గుమిగూడ వద్దు. 31 వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి. నీళ్లు, కూరగాయాలు, పాలు, విద్యుత్, ఫుడ్ డెలివరీ..మందుల షాపులు అందుబాటులో ఉంటాయి. దేశమంతా లాక్‌డౌన్ అయితేనే సమస్యకు పరిష్కారం. కరోనా ఉందని అనుమానం వస్తే 104 నంబరుకు కాల్ చేయాలి’ అని జగన్ మీడియా ముఖంగా వెల్లడించారు.
రేషన్ ఉచితం
‘రేషన్ కార్డు ఉన్న ప్రతికుటుంబానికి రూ. 1000 ఆర్థిక సాయం చేస్తాం. ఏప్రిల్ 4న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి ఇస్తాం. తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కిలో కందిపప్పు కూడా వాలంటీర్లు ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తాం. నిత్యవసర వస్తువులు, సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదవాళ్లు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. వృద్ధులు ఎవరూ గడప దాటి బయటికి రావొద్దు’ అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com