కొవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?: ఏపీ హైకోర్టు ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓవైపు కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో లేదంటే వాయిదా వేయడమో చేస్తున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని వెనక్కి తగ్గేదే లేదని భీష్మించింది. ఈ క్రమంలోనే నేడు(శుక్రవారం) ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పున:పరిశీలన చేసుకోవాలని హైకోర్టు సూచించింది.
పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో.. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని.. వారి జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం వెంటనే పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది. కేసు విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అదే రోజున ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. అయితే ఈ లోపు అంటే మే 2లోపు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా సోకిన విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై సైతం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సోకిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం కరోనా సోకిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలి కదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొనగా... అదెలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments