అంగన్‌వాడీలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం.. విధుల్లో చేరని వారిపై వేటు..
- IndiaGlitz, [Monday,January 22 2024]
అంగన్‌వాడీలపై జగన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చలో విజయవాడకు అంగన్‌వాడీలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. విధులకు హాజరుకాని వారి లిస్ట్‌ను పంపించాలని.. గైర్హాజరైన వారిని వెంటనే అటోమేటిక్ టెర్మినేషన్ చేయాలని సీఎస్ సూచించారు. మరోవైపు విజయవాడకు తరలివెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేషన్లలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను తక్షణమే విడుదల చేయాలన్నారు. 40రోజులకు పైగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి రుచి చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం తమకు కొంత సమయం కావాలని కోరుతోంది. అయినా సమ్మె విరమించకపోవడంతో ఇప్పటికే ఎస్మాను ప్రయోగించింది. జనవరి 5లోపు విధులకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. పలు మార్లు అంగన్‌వాడీ నాయకులతో చర్చలకు కూడా జరిపింది. కానీ సమస్య కొలిక్కి రాకపోవడంతో ధర్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విధుల్లో చేరని వారిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాలపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అటు అంగన్‌వాడీల సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు చెబుతున్నాయి. ప్రభుత్వం దుందుడుకు చర్యలను ఉపేక్షించేది లేదంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ అంగన్‌వాడీలు వర్సెస్ ప్రభుత్వం వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.