ఏపీలో రంజాన్ పండుగ మార్గదర్శకాల విడుదల
- IndiaGlitz, [Wednesday,May 12 2021]
విజయవాడ: కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రేపు(గురువారం) పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను సామూహికంగా నిర్వహించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూ కూడా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకూ ఈ కర్ఫ్యూ జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ మేరకు డిప్యూటీ సీఎం అంజద్ బాషా రంజాన్ పండుగ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధమని ఆయన వెల్లడించారు. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని వెల్లడించారు. మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావొద్దని తెలిపారు. ప్రార్థన సమయంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారు ప్రార్థనలకు రావొద్దని అంజద్ బాషా తెలిపారు.