Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్ సమక్షంలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 1952 నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగిందన్నారు. కాంగ్రెస్‌ను వీడుతానని తాను ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు పవర్ మాత్రమే కావాలని.. పార్టీలో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు హైకమాండ్ ప్రయత్నించడం లేదని... చేసిన తప్పులు ఏంటి అని కూడా తెలుసుకోవడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. నేతలను సంప్రదించకుండానే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలు తీసుకునేదని ఆయన ఎద్దేవా చేశారు. ఓటముల నుంచి పార్టీ గుణపాఠాలు నేర్చుకోవడం లేదని కిరణ్ కుమార్ అన్నారు.
ఎవరి కింద పనిచేయాలో తెలియని గందరగోళం:
ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల అభివృద్ధి కాలగమనంలోనే తెలుస్తుందని.. బీజేపీ ఎదుగుతున్న కొద్దీ కాంగ్రెస్ దిగజారుతూ వచ్చిందని కిరణ్ అన్నారు. 1980లో 7.7 శాతం వున్న బీజేపీ ఓటింగ్.. 2019లో 37 శాతానికి పైగా పెరిగిందన్నారు. పరిణామక్రమంలో కాంగ్రెస్ పార్టీ 19 శాతానికి పడిపోయిందని కిరణ్ పేర్కొన్నారు. ఈ పరిణామాలను అర్ధం చేసుకుని కాయకల్ప చికిత్స చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను గ్రహించకుండా మేం చేసేదే సరైనదన్న ధోరణిలో వుండిపోయిందన్నారు. చికిత్స జరగాల్సిన సమయంలో జరగకపోవడంతో కాంగ్రెస్ ఊహించనంతగా దిగజారిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అదే సమయంలో బీజేపీ నాయకత్వం ఒక్కో మెట్టు ఎక్కుతూ విస్తృతమైందన్నారు. బీజేపీ నాయకత్వంలో దేశ నిర్మాణం పట్ల స్పష్టమైన అవగాహన వుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి ఆలోచన, ఆచరణలో స్పష్టత వుందని ప్రశంసించారు. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణమన్న సంకల్పం బీజేపీకి వుందని ఆయన పేర్కొన్నారు. పార్టీని దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి విస్తరించాలన్న సంకల్పం వుందన్నారు.
>
కాగా.. గత నెల 12న కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖను పంపారు. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు అదే నిజమైంది.
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలోకి :
ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆయన ప్రయత్నం వృథా ప్రయాసే అయ్యింది. చివరికి తెలుగు నేల రెండు ముక్కలు కావడంతో సీఎం, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఆయన.. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ మౌనంగానే వుంటున్నారు.
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి :
తన తండ్రి నల్లారి అమర్‌నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ బడిలోనే ఓనమాలు దిద్దారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్మంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి .. 2014 ఫిబ్రవరి 19 వరకు పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com