అప్పుడు శభాష్ అనిపించుకున్న జగన్.. ఇప్పుడు పట్టించుకోవట్లేదేంటి..!?
- IndiaGlitz, [Monday,April 19 2021]
ఏపీ సీఎం జగన్.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. కరోనా కట్టడికి కృషి చేసిన తీరు ప్రశంసనీయం. ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహించి.. క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి కరోనా కట్టడి చేసిన తీరు ప్రశంసనీయం. కేసుల సంఖ్యను చాలా నిజాయితీగా ప్రకటించి ఔరా అనిపించారు. ముఖ్యంగా ప్రతీ మండల, గ్రామ ప్రాంతాలకు వెళ్లి టెస్ట్‌లు చేయడం..గ్రామ వాలంటీర్లతో బయట సిటీల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయడం.. వారిని టెస్ట్‌లకు తరలించడం.. స్కూల్స్‌కు సెలవులు.. విద్యార్థుల పట్ల కేరింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ చేపట్టిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి.
ఇక సెకండ్ వేవ్ విషయానికి వస్తే.. అసలు అదొకటి ఈ స్థాయిలో విజృంభిస్తోందన్న విషయం కూడా జగన్‌కు తెలుస్తున్నట్టుగా అనిపించడం లేదు. గత ఏడాది చేపట్టిన చర్యలకు.. ఇప్పటికీ ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. టెస్టులు చేయిస్తున్నారు సరే.. స్కూల్స్ మూసేయకపోవడం వల్ల రోజుకు ఘోరంగా కేసులు పెరిగిపోతున్నాయి. విద్యార్థుల కారణంగా వారి తల్లిదండ్రులకు సైతం కరోనా సోకుతోంది. ఇక హాస్టల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దయనీయం. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హాస్టల్స్‌లో, కాలేజీల్లో ఘోరాతి ఘోరంగా చూస్తున్నారు. వాళ్లకు సరైన ఫుడ్ లేక.. సౌకర్యాలు లేక.. పైగా ఏడెనిమిది మంది పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఒక్క రూమ్‌లో పెడుతున్నారు. ఇవన్నీ మరి జగన్ దృష్టికి వెళ్లాయో లేదో కూడా తెలియదు.
ఇందుకు గుంటూరు, విజయవాడ కేంద్రంగా నడుస్తున్న కొన్ని కాలేజీలే నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది మాదిరిగానే విద్యాసంస్థలను మూసివేసింది. ఇక పదోతరగతి పరీక్షలను రద్దు చేసింది. మిగతా పరీక్షలను వాయి వేసింది. కానీ ఏపీలో పది, ఇంటర్ విద్యార్థుల పరీక్షల గురించి ఇప్పటికీ తేల్చలేకపోవడం గమనార్హం. అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అని విద్యార్థులు.. ఇంత వరకూ క్లారిటీ రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు.. ఇకనైనా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని విశ్లేషకులు, విమర్శకులు, నిపుణులు చెబుతున్నారు. అసలు సెకండ్ వేవ్‌ను ఎందుకింత నిర్లక్ష్యంగా వదిలేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది రోజుకు లక్ష కేసులు నమోదైతేనే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది కానీ తాజాగా రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడమేంటని జనం ఆవ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా జగన్ తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.