రాయలసీమలో నవ్యాంధ్ర రాజధాని!?
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి రాయలసీమకు షిఫ్ట్ కానుందా..? త్వరలోనే అమరావతికి తూచ్ అని చెప్పేస్తారా..? శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే మళ్లీ రాజధాని నిర్మాణం జరుగుతుందా..? అంటే తాజాగా వైసీపీ మంత్రులు, నేతలు మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు ఈ నవ్యాంధ్ర రాజధాని కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
రాయలసీమ నేతల డిమాండ్!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కాదని మరో చోట నిర్మాణం జరుగుతుందని జగన్ సీఎం పీఠమెక్కిన నాటి నుంచే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఇన్ని రోజులుగా కొట్టి పారేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు తాజాగా మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ క్రమంలో రాజధాని విషయంలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.. ఒకవేళ రాజధానిని మార్చాలనుకుంటే రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిందేనని రాయలసీమ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలు నేతల డిమాండ్ ఇదీ!
ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆర్థర్లు రాజధాని గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోకుండా చంద్రబాబు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకున్నారని.. మార్చాలని నిర్ణయం తీసుకుంటే కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అమరావతిలో కొనసాగిస్తే.. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.
కేంద్రంతో జగన్ చర్చించారా..!?
వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పుకొచ్చారు. రాజధాని మార్పుపై కేంద్రంతో జగన్ చర్చించారని.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిపారు. రాజధాని విషయంలో తొందరపాటు పనికిరాదని.. దొనకొండ ప్రాంతం సరైంది కాదని.. రాయలసీమలో అన్ని వనరులతో ఉన్న తిరుపతిని రాజధాని చేయాలని చింతా డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రానికి సంబంధించిన విషయమని.. ఈ వ్యవహారంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అసలు ఇది కేంద్రం పరిధిలోకే రాదని తేల్చిచెప్పారు.
ఫైనల్గా ఈ వ్యవహారంపై అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout