నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ.. కఠిన నిబంధనల అమలు
- IndiaGlitz, [Wednesday,May 05 2021]
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి(బుధవారం) నుంచి కట్టుదిట్టమైన నిబంధనలతో కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. కర్ఫ్యూకు సంబంధించిన నిబంధనలతో కూడిన జీవోను ఇప్పటికే జారీ చేసింది. నేటిన మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు వారాలపాటు... అంటే, ఈ నెల 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలు, సరకు రవాణాతోపాటు మరికొన్ని రంగాలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలు, రాకపోకలకు అనుమతి ఇస్తారు. అయితే ఆ సమయంలో కూడా 144సెక్షన్ అమల్లో ఉంటుంది. అంటే జనం గుంపులుగా తిరగడానికి వీల్లేదు. మధ్యాహ్నం 12 తర్వాత ప్రజా రవాణాతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూసివేయాల్సిందేనని ఏ ఒక్క వాహనం కానీ వ్యక్తులు కానీ రోడ్డెక్కడానికి లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ‘వకీల్ సాబ్’ సినిమాపై కేసు..
అత్యవసర సేవలకు ఓకే..
అత్యవసర సేవలందించే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ, హైకోర్టు, ఇతర కోర్టులు, స్థానిక సంస్థల అధికారులు డ్యూటీ పాస్‌తో రాకపోకలు సాగించవచ్చు. వైద్య అవసరాల కోసం బయటకు రావొచ్చు. టికెట్ ఉన్నవారు ఎయిర్‌పోర్టు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇక పెళ్లి వేడుకను వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారైతే 20 మందితో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి కూడా స్థానిక అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
ఈ రంగాలకు మినహాయింపు...
కొన్ని రంగాల వారికి మాత్రమే కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, టెలీకమ్యూనికేషన్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు, పెట్రోలు పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్ విక్రయ కేంద్రాలు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు. శీతల, సాధారణ గిడ్డంగుల సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, ఉత్పాదక తయారీ పరిశ్రమలు. , వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ యథాతథంగా కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.